SunRisers Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న సన్ రైజర్స్
- ఐపీఎల్ 2023 సీజన్ కోసం మొదలైన ట్రెయినింగ్ క్యాంప్
- ఇప్పటికే నగరానికి చేరుకున్న ఆటగాళ్లు
- లారా, మురళీధరన్, స్టెయిన్ సమక్షంలో ప్రాక్టీస్ సెషన్స్
ఐపీఎల్ లో కొన్నేళ్లుగా నిరాశ పరుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆశిస్తోంది. ఈ నెల 31న మొదలయ్యే మెగా టోర్నీలో పలువురు కొత్త ఆటగాళ్లతో కొత్త రూపుతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను వదులుకొని దక్షిణాఫ్రికా స్టార్ ఐడెన్ మార్ క్రమ్ కు కెప్టెన్సీ అప్పగించిన సన్ రైజర్స్ వేలంలో దేశ, విదేశాలకు చెందిన కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. ఐపీఎల్ 2023 కోసం సన్ రైజర్స్ ట్రెయినింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది.
వారం నుంచి ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్, హారీ బ్రూక్, అభిషేక్ శర్మ తో పాటు పలువురు నూతన ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. కోచ్ లు బ్రయాన్ లారా, ముత్తయ్య మురళీధరణ్, డేల్ స్టెయిన్ సమక్షంలో డే టైమ్ తో పాటు రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ ట్రెయినింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. కాగా, ఏప్రిల్ 2వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ తొలి మ్యాచ్ తో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ ను ఆరంభించనుంది.