YS Sharmila: రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: షర్మిల

Sharmila condemns disqualification on Rahul Gandhi

  • మోదీ అనే ఇంటిపేరుపై గతంలో రాహుల్ వ్యాఖ్యలు
  • రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు
  • పార్లమెంటులో రాహుల్ పై అనర్హత వేటు
  • నిరంకుశ చర్య అంటూ షర్మిల విమర్శలు

మోదీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించగా, పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేయడం తెలిసిందే. దీనిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొన్నారు. విపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని హితవు పలికారు. 

వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఉన్నప్పటికీ, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని షర్మిల విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ప్రతిపక్షాలపై అణచివేత తగదని వివరించారు. 

రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవని, పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు. సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్నా, రాసుకున్న రాజ్యాంగం అమలు కావాలన్నా ఈ నిరంకుశ నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News