ISRO: రేపు శ్రీహరికోట నుంచి ఇస్రో వాణిజ్య రాకెట్ ప్రయోగం
- గత కొన్నేళ్లుగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న ఇస్రో
- రేపు ఎల్వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగం
- కౌంట్ డౌన్ ప్రారంభం
- సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ పూజలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ ప్రయోగాల్లో ఎంతో పురోగతి సాధించింది. గత కొన్నేళ్లుగా వాణిజ్య ప్రాతిపదికన విదేశీ ఉపగ్రహాలను కూడా రోదసిలోకి తీసుకెళుతోంది. తాజాగా ఇస్రో మరో వాణిజ్య రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. రేపు (మార్చి 26) ఉదయం 9 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్వీఎం3-ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ సంస్థకు చెందిన ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఎల్వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగం మరికొన్ని గంటల్లో జరగనుండగా, షార్ కేంద్రంలో మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
కాగా, ఈ రాకెట్ ప్రయోగం నేపథ్యంలో, సంప్రదాయం ప్రకారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. రాకెట్ ప్రయోగ కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని వివరించారు.