Uber: ఉబర్ నుంచి రూ.4.5 లక్షల నజరానా అందుకున్న భారతీయ హ్యాకర్
- క్యాబ్ సేవలకు ప్రసిద్ధికెక్కిన ఉబర్
- డబ్బు చెల్లించకుండానే ప్రయాణ సేవలకు అవకాశం కల్పిస్తున్న బగ్
- లోపాన్ని గుర్తించిన ఆనంద్ ప్రకాశ్
- వెంటనే ఉబర్ ను అప్రమత్తం చేసిన వైనం
హ్యాకింగ్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. కొందరు హ్యాకర్లు డబ్బు, కీలక సమాచారం చోరీ చేసేందుకు హ్యాకింగ్ కు పాల్పడతారు. మరికొందరు, మంచి పనుల కోసం హ్యాకింగ్ చేస్తుంటారు. దీన్నే ఎథికల్ హ్యాకింగ్ అంటారు. భారత్ కు చెందిన ఆనంద్ ప్రకాశ్ కూడా ఇలాంటివాడే.
ఈ ఎథికల్ హ్యాకర్ కు ప్రయాణ సేవల సంస్థ ఉబర్ రూ.4.5 లక్షల బహుమానం అందించింది. ఎందుకంటే... ఉబర్ సాఫ్ట్ వేర్ లో ఓ ప్రమాదకర బగ్ ను ఆనంద్ ప్రకాశ్ గుర్తించాడు. సాధారణంగా ఉబర్ క్యాబ్స్ లో ఎక్కాలంటే నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ బగ్... నగదు చెల్లించకుండానే, నగదు చెల్లించినట్టు చూపించేందుకు వీలు కల్పిస్తుంది. అంటే, ఉబర్ క్యాబ్స్ లో డబ్బు కట్టకుండానే ప్రయాణం చేసేయొచ్చు.
ఓ ఇన్ వాలిడ్ పేమెంట్ మెథడ్ రూపంలో ఈ బగ్ ఫ్రీ రైడ్ కు అవకాశం కల్పిస్తుంది. ఈ లోపాన్ని గుర్తించిన ఆనంద్ ప్రకాశ్ వెంటనే ఉబర్ ను అప్రమత్తం చేశాడు. దీనిపై స్పందించిన ఉబర్ తన సాఫ్ట్ వేర్ ను సవరించి, సదరు లోపాన్ని తొలగించింది. ఈ అంశాన్ని ఆనంద్ ప్రకాశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.