Priyanka Gandhi: ‘అమరుడి కొడుకును అవమానించినా కేసులేదు’: ప్రియాంక గాంధీ

Martyrs Son Called Mir Jafar yet No Cases Priyanka Gandhi Slams BJP

  • రాహుల్ గాంధీని ద్రోహి అన్నా, మీర్ జాఫర్ అన్నా కేసు పెట్టలేదని ఆరోపణ
  • సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక ప్రసంగం
  • తన అన్నను అమరవీరుడి కొడుకుగా సంబోధించిన ప్రియాంక
  • తమ కుటుంబాన్ని ఎన్నోమార్లు అవమానించారంటూ బీజేపీపై ఫైర్

భారతీయ జనతా పార్టీ తమ కుటుంబాన్ని ఎన్నోమార్లు అవమానించిందని, గాంధీ నెహ్రూల కుటుంబాన్ని కించపరచడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిపోయిందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వారు ఎన్నిమార్లు కించపరిచే వ్యాఖ్యలు చేసినా తమ కుటుంబం మౌనంగానే ఉందని గుర్తుచేశారు. తమను అవమానించినా సరే ప్రధాని మోదీ పట్ల తన సోదరుడు రాహుల్ గాంధీ ఎన్నడూ వ్యక్తిగత కోపాన్ని ప్రదర్శించలేదని చెప్పారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ఆత్మీయంగా కౌగిలించుకున్న సంఘటనను ప్రియాంక గుర్తుచేశారు. ఈమేరకు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష వేదికపై ప్రియాంక గాంధీ మాట్లాడారు.

తమ తండ్రి రాజీవ్ గాంధీ దేశంకోసం ప్రాణాలు అర్పించారని ప్రియాంక చెప్పారు. ‘‘ఓ అమరవీరుడి కొడుకు (రాహుల్ గాంధీ) ను ద్రోహి అంటూ మీర్ జాఫర్ తో పోల్చారు.. అయినా కూడా ఆ నేతపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఆయనపై అనర్హత వేటు పడలేదు’’ అని ప్రియాంక ఆరోపించారు. రాహుల్ ను నిత్యం అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏ ఒక్క బీజేపీ నేత పైనా కేసులు నమోదు కాలేదని విమర్శించారు. తన తల్లి సోనియా గాంధీతో పాటు కుటుంబంలో ఏ ఒక్కరినీ అవమానించకుండా బీజేపీ నేతలు వదలలేదని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News