Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం

Nikhat Zareen won World Boxing Championship gold

  • ఢిల్లీలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు
  • 50 కిలోల విభాగంలో పసిడి పంచ్ విసిరిన నిఖత్ జరీన్
  • ఫైనల్లో వియత్నాం బాక్సర్ పై ఘనవిజయం
  • భారత్ ఖాతాలో మూడో స్వర్ణం

ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. 50 కిలోల కేటగిరీలో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 

ఇవాళ జరిగిన ఫైనల్ బౌట్లో నిఖత్ వియత్నాం బాక్సర్ ఎన్ గుయెన్ థి టామ్ పై 5-0తో సంపూర్ణ ఆధిక్యం సాధించింది. 28-27, 28-27, 28-27, 29-26, 28-27తో న్యాయనిర్ణేతలందరూ నిఖత్ జరీన్ వైపే మొగ్గుచూపారు. 

కాగా, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిష్ చరిత్రలో నిఖత్ జరీన్ కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. 

కాగా, తాజా ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య మూడుకు పెరిగింది. నిన్న జరిగిన బౌట్లలో నీతూ ఘంఘాస్ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కిలోలు) పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. 

మరో మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ కూడా భారత్ కు పతకం ఖాయం చేసింది. ఇవాళ జరిగే 75 కిలోల కేటగిరీ ఫైనల్లో లవ్లీనా... ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్ తో తలపడనుంది.

  • Loading...

More Telugu News