UPI payments: యూపీఐతో చెల్లింపులా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి

precautions to be followed why making upi payments

  • యూపీఐ చెల్లింపులకు సంబంధించి రోజుకో కొత్త స్కామ్
  • అవగాహన లేనివారే టార్గెట్‌గా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
  • యూజర్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించిన పోలీసులు

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకుంటున్నారు.  స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్‌లతో అమాయకులకు టోపీ పెడుతున్నారు. ఇటీవల ముంబైలో సైబర్ మోసగాళ్లు ఏకంగా 81 మంది యూజర్లకు టోపీ పెట్టి ఏకంగా కోటి రూపాయలను కాజేశారు. 

పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బు పంపించామంటూ నిందితులు అమాయకులను తొలుత బుట్టలో వేసుకున్నారు. అయ్యో పాపం అనుకున్న యూజర్లు నిందితులకు సూచించిన నెంబర్లకు డబ్బు పంపించడం, ఫలితంగా వారి బ్యాంకు అకౌంట్లు ఖాళీ కావడంతో లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. పేమెంట్ మిస్టేక్ పేరిట స్కామర్లు కొత్త పథకానికి తెరలేపారంటూ పోలీసులు ప్రజలను తాజాగా అప్రమత్తం చేశారు. ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం అందించాలని సూచించారు. యూపీఐ చెల్లింపుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. 

సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు..

  • అధికారిక యాప్‌ స్టోర్లలోని బ్యాంకులకు చెందిన అఫీషియల్ యూపీఐ యాప్స్‌ను మాత్రమే వినియోగించాలి. 
  • ఇతరుల ఊహకు అందని విధంగా యూపీఐ పిన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పుట్టినరోజు, ఫోన్‌నెంబర్లతో పోలిన నెంబర్లను యూపీఐ పిన్‌గా అస్సలు వాడొద్దు.
  • యూపీఐతో చెల్లింపులు జరపాలంటే పిన్ తప్పనిసరి. కాబట్టి.. పిన్ నెంబర్ ఎవరితోనూ పంచుకోవద్దు. నమ్మకస్తులు, స్నేహితులకైనా సరే ఎట్టిపరిస్థితుల్లోనూ మీ పిన్ నెంబర్ చెప్పొద్దు. 
  • డబ్బు ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వారి వివరాలను ఒకటికి రెండు మార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. పేరు, యూపీఐ ఐడీ, ఇతర సంబంధిత వివరాలు సరైనవో కావో పరిశీలించుకోవాలి. 
  • యూపీఐ పిన్ నెంబర్,  అకౌంట్ వివరాలు కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు స్పందించకపోవడమే మంచిది. పొరపాటున డబ్బు పంపించామంటూ యూపీఐ మోసాలకు పాల్పడేవారి ఉదంతాలు ఇటీవల అనేకం వెలుగు చూశాయి.
  • ఒక విడతలో ఎంత మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయచ్చనేదానిపై పరిమితి విధించుకుంటే మంచిది. ఇందుకు సంబంధించిన సెట్టింగ్స్ యూపీఐ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక విడతలో చాలా తక్కువ మొత్తమే బదిలీ చేసేలా ఆప్షన్ ఎంచుకుంటే మాల్‌వేర్ బారినపడ్డ సందర్భాల్లో నష్టం తక్కువగా ఉంటుంది. 
  • యూపీఐ యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త కొత్త మాల్‌వేర్స్ బారిన పడకుండా ఉండాలంటే దీనికి మించిన మార్గం మరొకటి లేదు. 
  • యూపీఐ చెల్లింపులపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. 

  • Loading...

More Telugu News