SCO: కీలక సమావేసం కోసం భారత్ కు వచ్చేందుకు పాక్, చైనా నిరాసక్తి
- ఈ నెల 29న ఎస్ సీవో జాతీయ భద్రతా సలహాదారుల భేటీ
- భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వం
- వర్చువల్ గా పాల్గొనేందుకే చైనా, పాక్ ఆసక్తి
భారత్ లో జరిగే జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏలు) సమావేశానికి చైనా, పాకిస్థాన్ ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు. బదులుగా వర్చువల్ గా పాల్గొననున్నాయి. ఈ నెల 29న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో జరగనుంది.
రష్యా ఎన్ఎస్ఏ నికోలే పత్రుషేవ్ తోపాటు మధ్య ఆసియా దేశాల ఎన్ఎస్ఏలు పాల్గొననున్నారు. జులైలో సమావేశానికి సన్నాహాలపై చర్చించనున్నారు. యూరేషియన్ గ్రూప్ ఎన్ఎస్ఏలు.. ప్రాంతీయ అనుసంధానత, తీవ్రవాద వ్యతిరేక చర్యలు, సీమాంతర తీవ్రవాదం, డ్రగ్స్ ముప్పు, ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత నాయకత్వంలో జులైలో సదస్సు జరగనుంది. అలాగే, మే నెలలో షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశం గోవాలో జరగనుంది.