YS Vivekananda Reddy: వివేకా హత్య కేసును ఇలా ఇంకెన్నాళ్లు సాగదీస్తారు?: సీబీఐపై సుప్రీం ఆగ్రహం
- కేసుకు సంబంధించిన ఎలాంటి పురోగతి స్టేటస్ రిపోర్టులో లేదని సుప్రీం అసహనం
- ఎక్కడ చూసినా ‘రాజకీయ వైరం’ అని మాత్రమే రాశారని మండిపాటు
- దర్యాప్తు అధికారిని మార్చాలని, లేదా మరొకరిని నియమించాలని ఘాటు వ్యాఖ్యలు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించిన ఎలాంటి పురోగతి స్టేటస్ రిపోర్టులో లేదని అసహనం వ్యక్తం చేసింది. ఎక్కడ చూసినా ‘రాజకీయ వైరం’ అని మాత్రమే రాశారని వ్యాఖ్యానించింది. విచారణ అధికారిని మార్చాలంటూ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగడం లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని కోరుతూ.. కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై గత సోమవారం (మార్చి 20న ) అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తు పురోగతిపై సీల్డ్ కవర్‌లో నివేదిక అందించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ రోజు విచారణ సందర్భంగా.. వివేకా హత్య కేసు దర్యాప్తులో ఆలస్యంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో రాజకీయ వైరం కారణంగానే హత్య జరిగిందని పేర్కొన్నారు తప్పితే.. విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర గురించిన సమాచారం ఏదీ వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, ఇలా ఇంకెంత కాలం కొనసాగిస్తారని అసహనం వ్యక్తం చేసింది.
విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది. దీంతో దర్యాప్తు అధికారి సరిగానే విచారణ చేస్తున్నారని గత వారం సుప్రీంకోర్టుకు సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తెలిపారు. అయితే అదనంగా మరో అధికారిని నియమించాలని ధర్మాసనం సూచించింది. లేదంటే తామే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. సీల్డ్ కవర్ లో ప్రస్తావించిన అంశాలతోనే విచారణ నిర్వహిస్తే.. నిందితులకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండవని ఘాటు వ్యాఖ్యలు చేసింది.