Nara Lokesh: వైసీపీలో ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి: లోకేశ్
- పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- గుమ్మయ్యగారిపల్లిలో బహిరంగ సభ
- వైసీపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన లోకేశ్
- యువగళం దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని వ్యాఖ్య
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సాయంత్రం గుమ్మయ్యగారిపల్లిలో లోకేశ్ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయనగర సామ్రాజ్యం రెండో రాజధాని పెనుకొండ అని వెల్లడించారు. ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసి అమ్మిన ప్రాంతం అని కీర్తించారు. భూస్వాముల నుండి భూముల్ని విడిపించి పేదలకు పంచిన పరిటాల శ్రీరాములు పుట్టిన గడ్డ ఇది అని వివరించారు. ఫ్యాక్షన్ రూపంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అరాచక శక్తులను అణిచివేసిన అనంతపురం ముద్దుబిడ్డ పరిటాల రవీంద్రను ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీకి పంపిన ప్రాంతం ఈ పెనుకొండ అని లోకేశ్ పేర్కొన్నారు.
లోకేశ్ ప్రసంగం హైలైట్స్...
ఎంతో ఘన చరిత్ర ఉన్న పెనుకొండలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళాన్ని అడ్డుకోవద్దు అని జగన్ కి చాలా గౌరవంగా చెప్పాను వినలేదు.
నేను ముందే చెప్పా... సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని.
అడ్డొస్తా అన్నాడు. పోలీసుల్ని పంపి ఇబ్బంది పెట్టాడు. నా మైక్, సౌండ్ వెహికల్, స్టూల్ లాక్కున్నారు.
ఇప్పుడు యువగళం దెబ్బకి తాడేపల్లి ప్యాలస్ పునాదులు కదులుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చిన షాక్ కి జగన్ కి 104 డిగ్రీల జ్వరం పట్టుకుందట.
ఇప్పుడు దండయాత్ర ప్రారంభం అయ్యింది. వైసీపీ దుకాణం బంద్ అవ్వడం ఖాయం.
వైసీపీ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి రాజారెడ్డి వర్గం... రెండోవది అంబేద్కర్ వర్గం.
రాజారెడ్డి వర్గానికి అధ్యక్షుడు జగన్... అంబేద్కర్ వర్గానికి ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షురాలు.
వైసీపీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి గురించి తెలుసుకొని అందరూ బయటకి వస్తున్నారు.
అంబేద్కర్ గారి వర్గం బలం పెరుగుతుంది. రాజారెడ్డి వర్గం బలం తగ్గుతుంది.
జగన్ పరిపాలన చెత్త పరిపాలన. ఈ మాట నేను అనడం లేదు వైసిపి ఎమ్మెల్యేలే అంటున్నారు.
జగన్ రెడ్డి టెన్త్ ఫెయిల్ అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేదు.
మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. అందుకే మహిళలు ఎక్కడ చీపుర్లతో కొడతారో అని భయపడి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు.
రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు.
రాయలసీమలో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు. మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.
మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం వచ్చిన జగన్మోహన్ రెడ్డి మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా గోరంట్ల మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. టీడీపీ గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.
పెనుకొండ నియోజకవర్గం లో కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇక్కడ గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. రెండున్నర సంవత్సరాల కిందట ఇక్కడ గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ దీని గురించి పట్టించుకోలేదు.
గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం మంజూరు చేసామని చెప్పిన రెండు కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎమ్మెల్యే శంకర్ నారాయణ సమాధానం చెప్పాలి.
శ్రీకృష్ణదేవరాయలు రెండో రాజధానిగా ఉన్న పెనుకొండ కోట పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేసింది. కొండపైకి రోడ్డు మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేశాము. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ నాలుగేళ్లుగా రోడ్డు నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో హడావిడిగా పనులు మొదలుపెట్టారు.
పెనుకొండ కేంద్రంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం జగన్ రెండేళ్ల క్రిందట ప్రకటించారు. రెండేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశాడు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలు పెడతామని నాలుగేళ్లుగా మాటలు చెబుతున్నారు తప్ప పునాదిరాయి వేసింది లేదు.
టీడీపీ హయాంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ 90 శాతం పూర్తి చేసి మడకశిరలోని చెరువుకు నీరు అందించాం. తాము అధికారంలోకి వస్తే కాలువను పూర్తి చేసి మడకశిరలోని 100 చెరువులకు నీరు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్..ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తి చేయకుండా.. ఇప్పుడు బైపాస్ కెనాల్ నిర్మిస్తామని కొత్త మాట చెబుతున్నాడు. ఉన్నదాన్ని పూర్తి చేయలేని వాడు కొత్త కాలువ నిర్మిస్తానని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. బైపాస్ కెనాల్ నిర్మాణంపై ప్రకటన చేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఒక్క గంప మట్టి అయినా తీశారా?
పెనుకొండ లో ఒక అవినీతి అనకొండ ఉంది. పెనుకొండ అవినీతి అనకొండ పేరు శంకర్ నారాయణ.
సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే మాకొద్దీ అవినీతి అనకొండ అంటూ ధర్నాలు చేస్తున్నారు అంటే ఆయన దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఎమ్మెల్యే శంకర్ నారాయణ నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క తమ్ముడిని ఇన్చార్జిగా నిర్మించి సామంత రాజులను చేశాడు. వాళ్లు నిత్యం భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల ఎకరాలను కాజేశారు.
టీడీపీ ప్రభుత్వం కియా పరిశ్రమను ఏర్పాటు చేసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. రైతుల నుంచి తీసుకున్న భూములను వెనక్కు ఇప్పిస్తామని రెచ్చగొట్టాడు. ఇప్పుడు అదే కియా పరిశ్రమలో ఎమ్మెల్యే శంకర్నారాయణ, తమ్ముళ్లు కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు. కియాలో క్యాంటీన్ దగ్గర నుంచి స్క్రాప్ కాంట్రాక్టులు అన్ని బెదిరించి మరీ లాక్కున్నారు.
పెనుకొండ ను అభివృద్ది చేసింది టీడీపీ. ఇక్కడ వేసిన రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులు అన్ని మా హయాంలో చేసినవే.
పెనుకొండ మళ్ళీ అభివృద్ది బాట పట్టాలి అంటే టీడీపీని గెలిపించండి.
ఉమ్మడి అనంతపురం జిల్లా మా కుటుంబాన్ని ఆదరించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తాం.