Lakshmi Parvathi: అప్పట్లో లక్ష్మీ పార్వతి, ఇప్పుడు సజ్జల.. జగన్ జాగ్రత్తగా ఉండాలి: రఘురామరాజు
- లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడం వల్లే టీడీపీలో సంక్షోభం తలెత్తిందన్న రఘురామ రాజు
- జగన్ మేలుకోకుంటే సంక్షోభం తప్పదన్న ఎంపీ
- పార్టీ కోసం త్యాగాలు చేసిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సస్పెన్షన్ సిగ్గు చేటన్న నరసాపురం ఎంపీ
తెలుగుదేశం పార్టీలో అప్పట్లో లక్ష్మీ పార్వతి పోషించిన రోల్‌ను ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్నారని, జగన్ మేలుకోకుంటే సంక్షోభం తప్పదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు. ఢిల్లీలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఎన్టీ రామారావు ఎంత మంచివారైనా పార్టీలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో టీడీపీలో సంక్షోభం తలెత్తిందన్నారు. ఇప్పుడు వైసీపీలో సజ్జల కూడా అలానే వ్యవహరిస్తున్నారని, పరిస్థితి చేయి దాటిపోకముందే ఆయనను పక్కనపెట్టాలని, లేదంటే నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుందని జగన్‌కు సూచించారు.
ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి ఉద్యోగి అయిన సజ్జలకు రిపోర్టు చేయాలనడం సరికాదని రఘురామరాజు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారన్న ఆనం ప్రశ్న సబబుగానే ఉందన్నారు. వైసీపీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని రఘురామరాజు పేర్కొన్నారు.