minister: చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు: రోజా

minister Roja  Sensational Comments on MLAs

  • రాపాక వ్యాఖ్యలతో తేలిపోయిందన్న పర్యాటక మంత్రి
  • జగనన్న చరిష్మాతోనే వారు గెలిచారన్న రోజా
  • కాదనుకుంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్
  • జగన్ కన్నెర్రజేస్తే వారి పరిస్థితి ఏంటో? అంటూ వ్యాఖ్య

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ ఇచ్చిందని చెప్పడం చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలకు నిదర్శనమని ఏపీ పర్యాటక మంత్రి రోజా వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓటుకు నోటు మాదిరే.. ఏపీలోని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఆరోపించారు. డబ్బులిచ్చి లాక్కోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని, అందులో నలుగురు పడిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

టీవీ9 ప్రతినిధితో ఈ మేరకు రోజా మాట్లాడారు. విలువలు లేని చంద్రబాబుతో ఒప్పందాలు చేసుకుని, ఆ నలుగురు ఎమ్మెల్యేలు విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వారు ఎంత పెద్ద సీనియర్ నాయకులైనా జగన్ చరిష్మాతోనే ఎన్నికల్లో గెలిచారని, కాదనుకుంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు వారి విలువ ఏంటి, జగనన్న చరిష్మా ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 

డబ్బులతో విలువలు లేని వాళ్లను కొనుక్కొని, ఎమ్మెల్సీ ఏర్పాటు చేసుకుని, ఎమ్మెల్యేలంతా జగన్ కు వ్యతిరేకమని చెప్పడం సిగ్గు చేటనన్నారు. చంద్రబాబు నాయుడికి కుటిల, వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనన్నారు. చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని 2024 ఎన్నికల్లో ప్రజలు ఏపీ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే జగనన్నకు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణభయం ఉందని చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. కోవిడ్ సమయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధతో తనకు మెరుగైన చికిత్స ఇప్పించడం వల్లే బతికి బయటపడ్డానని చెప్పిన వ్యక్తి, ఈ రోజు ఇలా చెప్పడం చంద్రబాబు మార్గదర్శకం, స్క్రిప్ట్ వల్లేనని పేర్కొన్నారు. 

ప్రాణహాని అంటూ బూచి చూపిస్తున్నారని.. అలా అనుకుంటే జగనన్నకు హాని చేసిన ఎంతో మంది నేడు భూమి మీద ఉండేవారు కాదని రోజా అన్నారు. ప్రజల మేలు కోసమే జగన్  సమయం కేటాయిస్తారని.. దీనివల్లే శత్రువులు అందరూ నేడు బతికి బట్ట కట్టకట్టి, తిరిగి జననన్ననే తిట్టే పరిస్థితికి వస్తున్నారని అన్నారు. జగనన్న ఒక్కసారి కన్నెర్ర జేస్తే వీళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండని వ్యాఖ్యానించారు. ఎవరూ ఏమీ చేయక్కర్లేదని, వారి నియోజకవర్గ ప్రజలే కొట్టి చంపేస్తారని అన్నారు. 


  • Loading...

More Telugu News