Git Hub: భారత్ లోని తమ ఇంజినీరింగ్ టీమ్ ను ఇంటికి సాగనంపుతున్న గిట్ హబ్!

Git Hub reportedly layoffs its entire engineering staff in India
  • ఇటీవల ఉద్యోగాల కోత విధిస్తున్న ప్రముఖ కంపెనీలు
  • అదేబాటలో టెక్ డెవలపర్ సంస్థ గిట్ హబ్
  • అమెరికా తర్వాత భారత్ లోనే అతి పెద్ద సెంటర్ ను కలిగివున్న గిట్ హబ్
  • ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు
  • ఫిబ్రవరిలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న సంస్థ ప్రతినిధి!
ప్రముఖ టెక్ డెవలపర్ వేదిక గిట్ హబ్ లోనూ ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమవుతోంది. అనేక వెబ్, యాప్ టెక్నాలజీలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ గిట్ హబ్. దీని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్. 

ఇటీవల పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్న గిట్ హబ్ కన్ను భారత్ లోని టెక్ సెంటర్ పై పడింది. భారత్ లోని తమ ఇంజినీరింగ్ విభాగం మొత్తాన్ని తొలగించాలని గిట్ హబ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గిట్ హబ్ కు అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద డెవలపర్ సెంటర్ భారత్ లోనే ఉంది. ఓపెన్ సోర్స్ డెవలపర్ వేదిక గిట్ హబ్ లో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది సభ్యులు ఉంటే, ఒక్క భారత్ లోనే కోటి మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు. 

ప్రముఖ టెక్ రచయిత జెర్గెలీ ఓరోస్జ్ కూడా గిట్ హబ్ ఇంజినీరింగ్ టీమ్ ను తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలను నిర్ధారించారు. గిట్ హబ్ ఇండియన్ ఇంజినీరింగ్ టీమ్ ఇక లేనట్టేనని ట్వీట్ చేశారు. అయితే, అమెరికాతో పోల్చితే మానవ వనరుల సేవలు ఎంతో చవకగా లభించే భారత్ లో సిబ్బందిని తొలగిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని, గిట్ హబ్ నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుందో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. 

కాగా, ఉద్యోగుల తొలగింపుపై గిట్ హబ్ కూడా స్పష్టత నిచ్చింది. సంస్థను పునర్ వ్యవస్థీకృతం చేసే చర్యల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్టు గిట్ హబ్ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిర్ణయం ఫిబ్రవరిలోనే తీసుకున్నామని, ఇప్పుడు అమలు చేస్తున్నామని తెలిపారు. స్వల్పకాలిక ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక వ్యాపార వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని వివరించారు.
Git Hub
Engineering Dept
Layoff
India
Microsoft

More Telugu News