Polavaram Project: పోలవరం ఎత్తు తగ్గిస్తే ఊరుకునేది లేదు: నిరసన దీక్షలకు దిగిన అఖిలపక్షం
- విజయవాడ, గుంటూరు, విశాఖలో నిరసన దీక్షలు
- ప్రాజెక్టును ముందుగా డిజైన్ చేసినట్టుగానే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని డిమాండ్
- నిరసనల్లో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఎం, కాంగ్రెస్, లోక్‌సత్తా, ఆప్ నేతలు
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి నిర్మించాలన్న కేంద్రం ఒత్తిడికి ఏపీ ప్రభుత్వం తలొగ్గినట్టు వస్తున్న వార్తలపై అఖిలపక్ష నేతలు భగ్గుమన్నారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరులో నిరసన దీక్షలకు దిగారు. ప్రాజెక్టును ముందుగా డిజైన్ చేసినట్టుగానే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని రాజకీయ నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నిన్న విశాఖపట్టణం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు.
టీడీపీ, జనసేన, సీపీఎం, లోక్‌సత్తా, కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీల నేతలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేసిన ప్రకారం నిర్మించి ప్రజలకు మేలు చేస్తారో, లేదంటే ప్రాజెక్టును బ్యారేజీలా మార్చి ప్రజలకు అన్యాయం చేస్తారో జగన్ తేల్చుకోవాలన్నారు. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద కూడా అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష చేపట్టారు.