Karnataka Assembly Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక ప్రకటన చేసిన సిద్ధరామయ్య
- ఇవే తన చివరి ఎన్నికలన్న కాంగ్రెస్ సీనియర్ నేత
- కోలార్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు వెల్లడి
- వరుణ నియోజకవర్గంలోనే తన రాజకీయ కెరియర్‌కు ముగింపు పడుతుందన్న సిద్ధరామయ్య
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం వరుణ స్థానాన్ని కేటాయించింది. అయితే, తాను కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించిన సిద్ధరామయ్య, ఇవే తన చివరి ఎన్నికలని స్పష్టం చేశారు.
మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య.. 2018 ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి గెలుస్తానో, లేదోనన్న అనుమానంతో బాదామి నుంచి కూడా పోటీ చేసినట్టు గుర్తు చేసుకున్నారు. అయితే, ఈసారి తాను వరుణ నియోజకవర్గం నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, కోలార్ ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తూ అక్కడి నుంచి పోటీ చేయమని కోరారని అన్నారు. కాబట్టి కోలార్ టికెట్ కూడా కావాలని అధిష్ఠానాన్ని అడిగినట్టు చెప్పారు.
రాబోయే ఎన్నికలే తనకు చివరివన్న సిద్ధరామయ్య ఆ తర్వాతి నుంచి ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. తాను వరుణ నియోజకవర్గ కుమారుడినని పేర్కొన్నారు. ప్రజలు తనను దీవిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వరుణ నియోజకవర్గంలోనే తన రాజకీయ కెరియర్‌కు ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు.