Kodali Nani: ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే సీఎం జగన్!: కొడాలి నాని
- మరోసారి సీఎం జగన్ ను కొనియాడిన కొడాలి నాని
- ఎన్టీఆర్, వైఎస్సార్ లను మించి జగన్ సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని వెల్లడి
- వాళ్లిద్దరి కంటే రెండడుగులు ఎక్కువ వేస్తున్నారని వివరణ
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ప్లస్ వైఎస్సార్ ఈక్వల్ టు సీఎం వైఎస్ జగన్ అని అభివర్ణించారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను మించి జగన్ సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని వెల్లడించారు. వారిద్దరూ ఒకడుగు వేస్తే, జగన్ రెండడుగులు వేశారని వివరించారు.
"జగన్ అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ విస్తరణ, పాఠశాలల ఆధునికీకరణ, వసతి దీవెన తీసుకువచ్చారు. ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకువస్తే, జగన్ గ్రామాలను యూనిట్లుగా తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేశారు. ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చారు. రైతుల కోసం ఆర్బీకేలను ప్రారంభించారు. రైతులకు పురుగుమందులు, విత్తనాలు అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు" అని కొడాలి నాని వివరించారు.