Samantha: సూపర్ ఫుడ్ స్టార్టప్ ‘నోరిష్ యు’లో సినీనటి సమంత పెట్టుబడులు!

Tollywood Actor Samantha Ruth Prabhu invests in food startup Nourish You
  • సీడ్ ఫండింగ్ ద్వారా జనవరిలో రూ. 16.5 కోట్లు సమీకరించిన సంస్థ
  • సమంత ఎంత మొత్తం పెట్టబడి పెట్టారన్న విషయాన్ని వెల్లడించని సంస్థ
  • ‘మిల్లెట్ మిల్క్’ను విడుదల చేసిన సమంత
స్వదేశీ సూపర్‌ఫుడ్ స్టార్టప్ ‘నోరిష్ యు’లో ప్రముఖ సినీనటి సమంత పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది జనవరిలో సంస్థ సమీకరించిన 2 మిలియన్ డాలర్ల (రూ. 16.5 కోట్లు) సీడ్ ఫండింగ్‌లో సమంత భాగస్వామ్యం కూడా ఉన్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో బ్రాండ్ విలువ రూ. 65 కోట్లకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అయితే, సమంత ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. 

సంస్థలో ఇంకా ట్రయంఫ్ గ్రూపునకు చెందిన వై.జనార్దనరావు, డార్విన్‌బాక్స్ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, జెరోధా గ్రూప్ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, గ్రుహాస్ ఫౌండర్ అభిజీత్ పాయ్, కిమ్స్ ఆసుపత్రి సీఈవో అభినయ్ బొల్లినేని తదితరులు పెట్టుబడులు పెట్టినట్టు కృష్ణారెడ్డి వివరించారు. 

‘నోరిష్ యు’ పాతకాలపు ఆహార పద్ధతులను పరిచయం చేయడంతోపాటు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేస్తుందన్నారు. సమంత భాగస్వామ్యం కారణంగా మార్కెట్లో తమ ఉత్పత్తులకు మరింత ప్రచారం లభిస్తుందని పేర్కొన్నారు. 

కాగా, మొక్కల ఆధారిత ‘మిల్లెట్ మిల్క్’ను ఈ సందర్భంగా సమంత విడుదల చేశారు. రాగి, జొన్న, ఓట్స్, సజ్జలతో దీనిని తయారుచేశామని, పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించుకోవచ్చని సంస్థ సహ వ్యవస్థాపకురాలు సౌమ్యారెడ్డి తెలిపారు.
Samantha
Nourish You
Samantha Ruth Prabhu

More Telugu News