Amit Shah: యూపీఏ హయాంలో ఆ కేసులో మోదీని ఇరికించడానికి సీబీఐ అధికారులు నాపై ఒత్తిడి తెచ్చారు: అమిత్ షా
- ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో మోదీ పాత్ర ఉందని చెప్పించే ప్రయత్నం చేశారన్న అమిత్ షా
- తనను ప్రలోభ పెట్టారని వెల్లడి
- కాంగ్రెస్ కుట్రలు బీజేపీ ఎదుగుదలను ఆపలేకపోయాయని వ్యాఖ్య
- న్యాయ పోరాటం మానేసి కేంద్రంపై బురద జల్లుతున్నారని రాహుల్ గాంధీపై విమర్శ
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను తప్పుడు కేసులో ఇరికించేందుకు కుట్ర జరిగిందని అమిత్ షా ఆరోపించారు. అప్పట్లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ కుట్రకు సూత్రధారి అని చెప్పారు. ఈమేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ మోదీ సర్కారుపై ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అమిత్ షా గతంలో ఓ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఓ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో మోదీ ప్రమేయం ఉందని చెప్పాలని అధికారులు తనను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ కుట్రలు బీజేపీ ఎదుగుదలను ఆపలేకపోయాయని షా చెప్పారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంపైనా షా స్పందించారు. కోర్టు విధించిన శిక్షపై రాహుల్ గాంధీ హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడం మానేసి మోదీ సర్కారుపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మోదీపై, మోదీ సామాజికవర్గంపైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు శిక్ష విధించిందని, దీనిపై ఆయన న్యాయపోరాటం చేయాలని సూచించారు.
హైకోర్టులో అప్పీల్ చేసుకోకుండా, క్షమాపణ చెప్పకుండా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారంటూ రాహుల్ గాంధీపై షా మండిపడ్డారు. యూపీఏ పాలనలో తీసుకొచ్చిన చట్ట ప్రకారమే రాహుల్ పై అనర్హత వేటు పడిందని వివరించారు. ఇలా అనర్హత వేటు పడిన నేత రాహుల్ ఒక్కరే కాదని, గతంలో మొత్తం 17 మంది ప్రజాప్రతినిధులు తమ పదవులు కోల్పోయారని అమిత్ షా వివరించారు.