Elon Musk: ‘పంచదార విషం’ అన్న ట్వీట్ కి మస్క్ ఊహించని రియాక్షన్
- రోజూ ఉదయం డోనట్ తింటున్నా.. బతికే ఉన్నానంటూ మస్క్ కామెంట్
- చక్కెర అనేది స్లో పాయిజన్ అన్నది తన ఉద్దేశ్యమన్న వ్యక్తి
- ఏదైనా మోస్తరుగానే ఉండాలన్న అభిప్రాయం
కరోనా తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లను అనుసరించడం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. అనారోగ్యకర అలవాట్లతో వచ్చే నష్టంపై అవగాహన పెరుగుతుండడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో పంచదార ఆరోగ్యానికి విషంతో సమానమంటూ ఓ వ్యక్తి ట్విట్టర్ లో చేసిన ట్వీట్ పెద్ద చర్చకే తావిచ్చింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం దీనికి స్పందించారు.
పంచదార విషం అంటే మస్క్ అంగీకరించలేదు. ‘‘నేను ప్రతి రోజూ ఉదయం డోనట్ తింటాను. ఇప్పటికీ బతికే ఉన్నాను’’ అంటూ మస్క్ రిప్లయ్ ఇచ్చారు. టెక్నాలజీపై పోటీలు నిర్వహించే ఎక్స్ ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన పీటర్ హెచ్ డైమండిస్ ఈ చక్కెర విషం అన్నదాన్ని చర్చకు తెచ్చారు. తాను చెప్పిన దానికి మస్క్ విరుద్ధంగా స్పందించడంతో.. అప్పుడు పీటర్ హెచ్ డైమండిస్ మళ్లీ స్పందిస్తూ ‘‘ఓకే ఎలాన్, నన్ను మరింత స్పష్టంగా చెప్పనివ్వండి. షుగర్ అన్నది నిదానంగా ఎక్కే విషం’’ అని ట్వీట్ చేశారు. 1.25 కోట్ల మందిని ఈ ట్వీట్ చేరిందంటే మామూలు విషయం కాదు.
ఏదైనా కానీ, మోస్తరుగానే ఉండాలంటూ ఓ యూజర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘డోనట్స్ అన్నవి మైదా, పంచదార కలిపి, నూనెలో ఫ్రైడ్ చేసినవి. ఆరోగ్యానికి అత్యంత చెడ్డ పదార్థాల్లో ఒకటి’’ అని మరో యూజర్ పేర్కొన్నారు. వారెన్ బఫెట్ ప్రతి రోజూ ఓ చెర్రీ కోక్ తాగుతారని, అయినా ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నారంటూ మరో యూజర్ చెప్పే ప్రయత్నం చేశారు.