Nara Lokesh: కియా పరిశ్రమతో నారా లోకేశ్ సెల్ఫీ.. జగన్ ను ఉద్దేశిస్తూ ట్వీట్!

Nara Lokeshs selfie with Kia industry and tweet against Jagan

  • ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా పరిశ్రమలు వచ్చాయన్న లోకేశ్
  • వైసీపీ సర్కార్‌ ది విధ్వంస పాలనని మండిపాటు 
  • ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలనను ప్రారంభించారని విమర్శ
  • కియా లాంటి కంపెనీని ఏపీకి తీసుకురావడం గురించి జగన్ కలలో కూడా ఊహించలేరని ట్వీట్

టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో సాగుతోంది. 55వ రోజైన గురువారం ఉదయం పెనుకొండలో పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘కియా’ కార్ల ఇండస్ట్రీ వద్దకు చేరుకున్నారు. కియా పరిశ్రమ ముందు లోకేశ్ సెల్ఫీ తీసుకున్నారు. 

అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా పరిశ్రమలు వచ్చాయని చెప్పారు. ఈ పరిశ్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని, అందుకే ప్రజలు తమకు ఓటు వేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ సెల్ఫీ రూపంలో ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘‘టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసింది. కానీ చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయాం. అందుకే ప్రజలు అలాంటి ఫలితాలు ఇచ్చారు’’ అని వివరించారు.

వైసీపీ సర్కార్‌ ది విధ్వంస పాలన అని విమర్శించారు. అభివృద్ధి చేయాలన్న తలంపు ఏ కోశాన జగన్‌ సర్కార్‌కు లేదని మండిపడ్డారు. ‘‘మేం చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కియా పరిశ్రమ రావడం చంద్రబాబు ఘనతే. కానీ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ప్రజావేదిక కూల్చివేతతో వైఎస్ జగన్ పరిపాలనను ప్రారంభించారు. అన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడమే తప్ప కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు’’ అని విమర్శించారు.

‘‘ఇది కియా. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ సంస్థ రూ.13,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 ఉద్యోగాలు కల్పించింది. సంవత్సరానికి 4 లక్షల వాహనాలు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఇలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకురావడం గురించి మీరు కలలో కూడా ఊహించలేరు వైఎస్ జగన్’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కియా పరిశ్రమ, కారుతో తీసుకున్న సెల్ఫీని కూడా షేర్ చేశారు.

  • Loading...

More Telugu News