ramya: అమ్మానాన్న తర్వాత రాహుల్ గాంధీనే: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య
- నాన్న చనిపోయాక ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవన్న రమ్య
- ఆ సమయంలో రాహుల్ గాంధీ సాయం చేశారని, మద్దతుగా నిలిచారని వెల్లడి
- తనను ప్రభావితం చేసిన వారిలో రాహుల్ ఒకరని వ్యాఖ్య
గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) చెప్పారు. తన తండ్రి చనిపోయాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆ సమయంలో తనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను తాజాగా ఓ కన్నడ టాక్ షోలో పంచుకున్నారు.
‘‘మా నాన్న చనిపోయిన రెండు వారాలకు పార్లమెంటుకు వెళ్లాను. అక్కడ నాకు ఎవరూ, ఏమీ తెలియదు. కనీసం పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కూడా తెలీదు. క్రమంగా ప్రతిదీ నేర్చుకున్నాను. నా బాధను నా పని వైపు మళ్లించాను. మాండ్యా ప్రజలు నాకు ధైర్యాన్ని ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘మా అమ్మ నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి. ఆ తర్వాత నాన్న. మూడో వ్యక్తి రాహుల్ గాంధీ. నాన్న చనిపోవడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆత్మహత్య గురించిన ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలిచారు’’ అని వివరించారు.
2012లో యూత్ కాంగ్రెస్ లో చేరిన రమ్య.. 2013లో కర్ణాటకలోని మాండ్యా ఎంపీ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ గా నియమితులయ్యారు. కానీ కొన్నాళ్లకు రాజీనామా చేశారు. గతేడాది సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి, నిర్మాణ సంస్థ ప్రారంభించారు. అయితే సినిమల్లో మాత్రం ‘రమ్య’గానే ఎక్కువ మందికి ఈమె తెలుసు.