Rama Navami: హైదరాబాదులో శ్రీరాముని శోభాయాత్ర.. ఈ రూట్లలో ట్రాఫిక్‌ అంక్షలు

traffic restrictions and diversions in many parts of hyderabad due to sri rama shobha yatra

  • శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర
  • భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
  • పలు రూట్లలో రాత్రి 9 దాకా ఆంక్షలు, మళ్లింపులు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రజలకు పోలీసుల సూచన

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. పోలీసులు భద్రత పెంచారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీతారామ్ బాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శ్రీరాముడి శోభాయాత్ర సాగనుంది. బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకోనుంది.

సీసీ కెమెరా, పోలీస్ నిఘా నీడలో ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి పరిస్థితిని పోలీసు అధికారులు నిత్యం పర్యవేక్షించనున్నారు. శోభాయత్ర రూట్ మ్యాప్ లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, పలు మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.

ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్.. సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా.. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్.. సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుత్లీబౌలి చౌరస్తా.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా.. రాత్రి 7 నుంచి 9 వరకు కాచిగూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్.. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

  • Loading...

More Telugu News