Tanuku: పశ్చిమ గోదావరిలో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి
- పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో సీతారాముల కల్యాణమహోత్సవం
- షార్ట్ సర్క్యూట్ కారణంగా చలువ పందిరిలో చెలరేగిన మంటలు
- భయంతో బయటకు పరుగులు తీసిన భక్తులు
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పండుగను హిందువులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. యావత్ దేశం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దువ్వలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో రాముల వారి కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం సందర్భంగా భక్తులకు ఎండ తగలకుండా ఉండేందుకు చలువ పందిరి వేశారు. అయితే కల్యాణం జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ అయి, చలువ పందిరిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించడంతో భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే, స్థానికులు, భక్తులు కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.