Andhra Pradesh: జగన్, వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు.. ప్రవాసాంధ్రుడి అరెస్ట్
- ప్రవాసాంధ్రుడు కోటిరత్నం అంజన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- రిమాండ్‌కు తరలించేందుకు న్యాయమూర్తి నిరాకరణ
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దని పోలీసుల కౌన్సిలింగ్
- సొంత్త పూచీకత్తుపై విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వం, పార్టీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఆరోపణలపై ప్రవాసాంధ్రుడిని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నవరానికి చెందిన పొందూరు కోటిరత్నం అంజన్ అమెరికాలో ఎంఎస్ చదివి అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం, పార్టీకి వ్యతిరేకంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ కార్యకర్త వంజరాపు నాగసూర్య ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున అంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి ఫోను, ల్యాప్‌టాప్, ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు.
టీడీపీ యువనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంజన్ పోస్టులు పెడుతున్నట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంజన్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం నిన్న సాయంత్రం అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ శిరీష ఎదుట అంజన్‌ను హాజరు పరిచి రిమాండ్ కోరారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఆయనకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దని చెప్పారు.