Kajal Aggarwal: బాలీవుడ్ లో నైతిక విలువలు లోపించాయి.. కాజల్ అగర్వాల్ విమర్శలు!
- దక్షిణాది పరిశ్రమలో నైతికత, విలువలు, క్రమశిక్షణ ఉన్నాయన్న కాజల్
- బాలీవుడ్లో అవి లోపించాయని విమర్శ
- హైదరాబాద్, చెన్నైలనే సొంత ఇళ్లుగా భావిస్తానని వెల్లడి
- దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని వ్యాఖ్య
బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ విమర్శలు చేశారు. దక్షిణాది పరిశ్రమలో నైతికత, విలువలు, క్రమశిక్షణ ఉన్నాయని, కానీ బాలీవుడ్లో అవి లోపించాయని అన్నారు. టాలెంట్ ఉంటే దక్షిణాది ప్రేక్షకులు తప్పకుండా అంగీకరిస్తారని చెప్పుకొచ్చారు.
ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సెషన్లో పాల్గొన్న కాజల్ ‘సౌత్ వర్సెస్ బాలీవుడ్’ అనే అంశంపై మాట్లాడారు. ‘‘నేను ముంబై అమ్మాయిని. నటిగా నా కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్లో. ఉత్తరాది అమ్మాయినైనా తెలుగు, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా పనిచేశా’’ అని వివరించారు.
బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్, చెన్నైలనే సొంత ఇళ్లుగా భావిస్తానని కాజల్ చెప్పారు. తాను సినిమాల్లో ఉన్నా లేకున్నా ఈ విషయంలో మార్పు ఉండదని తెలిపారు. ‘‘జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఎక్కువ మంది హిందీ సినిమాల్లో నటించానుకుంటారు. కానీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. కానీ బీటౌన్లో అది లేదు’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారు. అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కథలు పుట్టుకొస్తున్నాయి. నా మాతృభాష హిందీ. బాలీవుడ్ చిత్రాలు చూస్తు పెరిగాను. బాలీవుడ్లో కూడా నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. చేశాను కూడా. కానీ దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్లో లోపించాయని నా అభిప్రాయం’’ అని వ్యాఖ్యానించారు. కాజల్ వ్యాఖ్యలపై బాలీవుడ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.