USA: హిందూవ్యతిరేక భావజాలాన్ని ఖండిస్తూ జార్జియా అసెంబ్లీ తీర్మానం

Georgia becomes first state in america to pass resolution condemning hinduphobia

  • హిందూవ్యతిరేకతను ఖండిస్తూ అసెంబ్లీలో లారెన్ మెక్‌డోనల్డ్, టాడ్ జోన్స్‌‌ల తీర్మానం
  • తీర్మానాన్ని ఆమోదించిన సభ
  • కొందరు మేధావులు హిందూ వ్యతిరేకతను వ్యవస్థీకృతం చేస్తున్నారన్న సభ్యులు

హిందూవ్యతిరేక భావజాలాన్ని ఖండిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్ర అసెంబ్లీలో తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ఇలాంటి తీర్మానానికి ఆమోదముద్ర వేసిన తొలి రాష్ట్రంగా జార్జియా చరిత్ర సృష్టించింది. ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రజాప్రతినిధులు  లారెన్ మెక్‌డోనల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జార్జియాలో హిందూ జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫోర్సిత్ కౌంటీ కూడా ఒకటి. 

ఈ తీర్మానంలో హిందూ వ్యతిరేకతను సభ్యులు నిర్ద్వద్వంగా ఖండించారు. హిందూమతం ప్రపంచంలో అతిపురాతనమైన మతాల్లో ఒకటని సభ్యులు ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ల మంది హిందువులున్నారని, పరస్పర గౌరవం, శాంతిసౌభాగ్యాలే హిందూ సంస్కృతి పునాదులని వ్యాఖ్యానించారు. అనేక సంప్రదాయాలు, సంస్కృతులు, నమ్మకాల సమాహారమే హిందూమతమని చెప్పుకొచ్చారు. 

వైద్యం, సైన్స్, ఇంజినీరింగ్, ఐటీ, ఆతిథ్యం, ఆర్థికం, బోధన, రిటైల్, తయారీ రంగాల అభ్యున్నతికి అమెరికాలోని హిందువులు తమ వంతు తోడ్పాటునందించారని సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచానికి హిందూ సంస్కృతి అందించిన యోగా, ఆయుర్వేదం, ధ్యానం, విభిన్న సంగీత కళాతీరులను అమెరికా సమాజం తనలో ఇముడ్చుకుందని అభిప్రాయపడ్డారు. 

అమెరికాలో గత కొన్ని దశాబ్దాల్లో హిందూ వ్యతిరేక ఘటనలు అనేకం జరిగాయని సభ్యులు విచారం వ్యక్తం చేశారు. హిందూమతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలను, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసే చర్యలకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. మేథావుల్లో కొందరు హిందూవ్యతిరేకతను పెంచి వ్యవస్థీకృతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిపారు. 

కాగా.. హిందూవ్యతిరేకతను ఖండిస్తూ జార్జియా అసెంబ్లీ తీర్మానాన్ని స్థానిక హిందువులు స్వాగతించారు. అంతేకాకుండా.. ఈ తీర్మానానికి ఇతర సభ్యుల మద్దతు కూడగట్టడంలో చొరవ చూపిన ప్రజాప్రతినిధులు మెక్‌డోనల్డ్, జేమ్స్‌తో కలిసి పనిచేయడం తమకెంతో గర్వకారణమని కొయెలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్‌‌‌ అమెరికా సంస్థ వైస్‌ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ వ్యాఖ్యానించారు.

USA
  • Loading...

More Telugu News