LPG Cylinder: తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. నేటి నుంచే కొత్త ధరలు అమల్లోకి
- 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 92 తగ్గింపు
- గృహ వినియోగ సిలిండర్ ధరలో లేని మార్పు
- ఢిల్లీలో రూ. 2,028కి తగ్గిన 19 కేజీల సిలిండర్ ధర
వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 19 కేజీల సిలిండర్ ధరను ఏకంగా రూ. 92 తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత నెలలో కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 350 పెంచింది.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర గతేడాది నాలుగుసార్లు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 25 పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో ధర రూ.1,768కి చేరుకుంది. గత నెలలో రూ. 350 పెరగడంతో ధర రూ. 2,120కి చేరుకుంది. ఇప్పుడు రూ. 92 తగ్గడంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,028కి దిగొచ్చింది. కోల్‌కతాలో రూ. 2,132, ముంబైలో రూ.1,980, చెన్నైలో రూ. 2,192.50గా ఉంది.