Telangana: తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు వానలు

Rain threat for telangana for four days

  • పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలకు అవకాశం
  • ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మారనున్న వాతావరణం
  • పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ

తెలంగాణలో వాతావరణం మరోసారి మారనుంది. ఓవైపు ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మధ్య మధ్యలో వర్షాలు పలకరిస్తున్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షం కురవనుంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటలు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 

తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రం మట్టం నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని ప్రకటించింది. నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరోవైపు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం కురిసింది. భద్రాచలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. యోగ నరసింహస్వామి దేవాలయంలో ధ్వజస్తంభంపై పిడుగు పడింది.

  • Loading...

More Telugu News