Italy: పదిహేనేళ్ల పాటు అంధురాలిగా నటించిన ఇటలీ మహిళ.. ఎందుకంటే!
- ప్రభుత్వాన్ని బోల్తా కొట్టించి పింఛన్ రూపంలో రూ.1.8 కోట్లు అందుకుంది
- తడబడకుండా ఫైళ్లపై సంతకాలు చేసేయడంతో అనుమానించిన అధికారులు
- నిఘా పెట్టడంతో మొబైల్ ఫోన్ స్క్రీన్ ను స్క్రోలింగ్ చేస్తూ దొరికిపోయిన వైనం
కంటిచూపునకు ఎలాంటి ఢోకా లేకున్నా సరే ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఇంటి చుట్టుపక్కల వారితో పాటు ప్రభుత్వ అధికారులనూ నమ్మించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదిహేనేళ్ల పాటు కళ్లు కనబడనట్లు యాక్ట్ చేసింది. అయితే, ఫైళ్లపై సంతకం చేసేటపుడు ఎలాంటి తడబాటు లేకుండా సరిగ్గా పెట్టడంతో అధికారులకు అనుమానం వచ్చింది. కొన్నిరోజులు నిఘా పెట్టడంతో సదరు మహిళ చేస్తున్న మోసం బయటపడింది. ఇంతకీ ఇలా ఎందుకు నటించిందంటే.. ప్రభుత్వం ఇచ్చే పింఛను కోసమట! ఈ పదిహేనేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు (మన రూపాయలలో 1.8 కోట్లు) అందుకుందట. ఈ వింత ఘటన ఇటలీలో జరిగింది.
అధికారుల వివరాల ప్రకారం.. 48 ఏళ్ల మహిళ అంధత్వ సర్టిఫికెట్ తో సామాజిక భద్రత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. సర్టిఫికెట్ తో పాటు ఆమెను పరీక్షించిన అధికారులు పింఛన్ మంజూరు చేశారు. పదిహేనేళ్ల పాటు ఆ మహిళ పింఛన్ అందుకుంది. సదరు మహిళ సంతకం చేసే విధానంతో అనుమానం వచ్చి నిఘా పెట్టగా.. ఆమె అంధురాలిగా నటిస్తున్న విషయం బయటపడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా.. ఆమెకు తప్పుడు సర్టిఫికెట్ జారీ చేసిన వైద్యుడిపైనా కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వివరించారు.