TSPSC paper leak: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులకు సిట్ నోటీసులు
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు
- మొత్తం సభ్యులందరి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న సిట్
- సిట్ అదుపులో బోర్డు మెంబర్ లింగారెడ్డి పీఏ రమేశ్
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది. ఇప్పటివరకూ నిందితులు, ఉద్యోగులే కేంద్రంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు తాజాగా తమ దృష్టిని టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులవైపు మళ్లించారు. తాజాగా బోర్డు సభ్యలకూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి బోర్డు చైర్మన్, సెక్రెటరీలను కూడా విచారించనున్నారు.
ఇప్పటికే బోర్డ్ మెంబర్ లింగారెడ్డి పీఏ రమేశ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్‌లో అతడి పాత్రపై విచారిస్తున్నారు. అంతేకాకుండా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబందించి బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఏడుగురు సభ్యుల స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. బోర్డులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సిట్ అధికారులు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ రూంలోకి ఎవరు పడితేవారు వెళ్లడం, ఏకంగా పెన్ డ్రైవ్‌లో ప్రశ్నపత్రాలను కాపీ చేయడం వంటి ఘటనలతో అక్కడ నిఘా నామమాత్రంగా ఉందని అంచనాకు వచ్చారు.