IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య
- క్లాసు జరుగుతుండగా మధ్యలోనే తన గదికి వెళ్లిపోయిన సచిన్ జైన్
- కాసేపటికి స్నేహితులు వెళ్లి చూస్తే ఉరి వేసుకుని కనిపించిన విద్యార్థి
- ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’’ అంటూ వాట్సాప్ స్టేటస్
మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న ఐఐటీ మద్రాస్ విద్యార్థి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’’ అంటూ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని సచిన్ కుమార్ జైన్‌గా పోలీసులు గుర్తించారు.
సచిన్ జైన్‌ది పశ్చిమ బెంగాల్. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. శుక్రవారం అతడు యథావిధిగా గిండీ క్యాంపస్‌లో తరగతులకు హాజరయ్యాడు. అయితే.. మధ్యలో ఎవరికీ చెప్పకుండా అతడు తన గదికి వచ్చేశాడు. అయితే..గంటసేపైనా అతడు క్లాసుకు తిరిగిరాకపోవడాన్ని గమనించిన స్నేహితులు అతడి గదికి వెళ్లి చూడగా అతడు ఉరివేసుకుని కనిపించాడు. స్నేహితుల సమాచారంతో ఘటనాస్థలానానికి చేరుకున్న అత్యవసర సహాయక బృందం అతడు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.