Raghu Rama Krishna Raju: అందరూ నేచురల్ స్టార్ నాని అంటారు కానీ... జగనే నేచురల్ స్టార్: రఘురామ
- రఘురామ ప్రెస్ మీట్
- దసరా సినిమా స్టోరీ చెప్పిన నరసాపురం ఎంపీ
- మద్యం పాయింట్ మీద స్టోరీ అని వివరణ
- ప్రజలు మాలాంటి నేతలను నిలదీయాలని రఘురామ పిలుపు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన రోజువారీ మీడియా సమావేశంలో నాని దసరా సినిమాను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా దసరా సినిమా చూశానని రఘురామ వెల్లడించారు. ఇందులో మద్య నిషేధం పాయింట్ ఉందని తెలిపారు. ఓ గ్రామంలో ఎన్నికల సందర్భంగా మద్యం తీసేస్తానన్న వ్యక్తి ఓడిపోతాడని, మద్యం ఇస్తానని, డబ్బులు కూడా ఇస్తానని చెప్పిన వ్యక్తి గెలుస్తాడని వివరించారు.
"ఆ గ్రామంలో 'సిల్క్' పేరిట ఓ బార్ ఉంటుంది. అందులో ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ సరఫరా చేస్తుంటారు. అయితే ఈ గ్రామంలో క్రమంగా మగవారి సంఖ్య తగ్గిపోతుంటుంది. ఇందుకు కారణం ఏంటంటే... మగవాళ్లు ఆ సిల్క్ బార్ లో చీప్ లిక్కర్ తాగడమే. కొన్నాళ్లకు ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇలాంటి చెత్త సరుకు వల్ల ప్రజల ప్రాణాల మీదకు వస్తోందని గుర్తిస్తారు. ఇలా మగవారి సంఖ్య తగ్గించి, ఆడవారి సంఖ్య పెరిగిపోయేలా చేస్తున్న ఇలాంటి దరిద్రులను ఎన్నుకుని మనం తప్పు చేశామని వాళ్లు భావిస్తారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో వాళ్లను గ్రామ ప్రజలు ఓడిస్తారు. లిక్కర్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నవాళ్లను ప్రజలు ఎన్నికల్లో తిప్పికొడతారు.
దసరా సినిమా బాగుంది. మనకు స్ఫూర్తినిస్తుంది. మహిళలు తిరగబడాలి... మోసం చేసిన మా లాంటి నేతలను నిలదీయాలి. నాన్న బుడ్డి రూపంలో అమ్మ ఒడి డబ్బులు లాగేస్తున్నాం కదా... ఇదేం న్యాయం అని అడగండి మమ్మల్ని. ఈ లిక్కర్ తాగి కిడ్నీలు, లివర్ చెడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులో కెమికల్స్ ఉన్నాయని నేను కంప్లెయింట్ ఇచ్చినా, మేనేజ్ చేసేశారు.
అందరూ దసరా సినిమా చూడండి. నాని ధైర్యవంతుడైన కుర్రాడు. అసలు నేచురల్ స్టార్ మా జగనే. అందరూ నానీని నేచురల్ స్టార్ అంటారు గానీ... మావాడే ఎక్కువ నేచురల్ స్టార్. రీల్ లైఫ్ నేచురల్ స్టార్ నాని అయితే... రియల్ లైఫ్ నేచురల్ స్టార్ జగన్" అని వివరించారు.