Pakistan: ఆహారం కోసం పాక్ లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య
- దేశంలో గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం
- తిండి దొరకక అల్లల్లాడుతున్న జనం
- ఉచిత రేషన్ కోసం క్యూ కడుతున్న పౌరులు
- కరాచీలో శుక్రవారం ఒక్కరోజే 12 మంది దుర్మరణం
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ద్రవ్యోల్బణం కనీవినీ ఎరగని స్థాయికి చేరింది. దీంతో నిత్యావసరాలు కొనలేక, తిండి దొరకక జనం అల్లల్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత రేషన్ పంపిణీ కేంద్రాల ముందు క్యూ కడుతున్నారు. అయితే, గంటల తరబడి క్యూలో నిలుచున్నా తమవంతు వచ్చేసరికి సరుకులు అయిపోవడంతో చాలామంది ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. దీంతో క్యూలో చివర నిలుచున్న వారు ఆందోళనచెందుతూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కాస్తా తొక్కిసలాటకు దారితీస్తోంది.
రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం కరాచీలో ఓ కంపెనీ ఉచిత రేషన్, నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీంతో జనం కంపెనీ ముందు బారులు తీరారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరాచీతో పాటు పలు నగరాలలో ఉచిత రేషన్ కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరుగుతున్నాయి. గత పది రోజుల్లో తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 20 కి చేరింది.