Indian Railways: రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఫోన్ పడిపోతే.. ఇలా చేయండి!

Indian railway if your mobile phone falls from train railway officers will get it to you

  • విలువైన వస్తువులు పడిపోతే రైల్వే పోలీసులు వెతికి తెచ్చిస్తారు
  • ఫిర్యాదు సమయంలో ఇచ్చే వివరాల్లో స్పష్టత ఉండాలంటున్న అధికారులు
  • ఏ ప్రాంతంలో పడిపోయిందనేది స్పష్టంగా చెబితే వస్తువు దొరికే చాన్స్ ఎక్కువ
  • అలారం చైన్ లాగేందుకు ప్రయత్నించొద్దని సూచన

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తోంది ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలందించేందుకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే రన్నింగ్ ట్రైన్ లో నుంచి విలువైన వస్తువులు పడిపోతే టెన్షన్ పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. వాటిని వెతికి తెచ్చిచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అయితే, మీ వస్తువు పడిపోయిన ప్రాంతం గురించి కొన్ని వివరాలు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఫిర్యాదులో మీరు ఇచ్చే వివరాల్లో స్పష్టత ఎంత ఎక్కువుంటే పడిపోయిన వస్తువు దొరికే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

విలువైన వస్తువు పడిపోతే చేయాల్సిందిదే..
రైలులో విండో పక్కన కూర్చున్నపుడు ఫోన్, పర్స్ లాంటి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.. పొరపాటున ఏదైనా వస్తువు కింద పడిపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలు రాసిపెట్టుకోవాలి. ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో వ్రాసిన నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఏ రెండు స్టేషన్ల మధ్య పడిపోయిందనేది గుర్తుంచుకోవాలి. వేరే ఫోన్ తో రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 182 లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి ఫిర్యాదు చేయాలి.

పడిపోయిన ప్రాంతానికి సంబంధించిన వివరాలను ఇందులో పేర్కొనాలి. మీ ఫిర్యాదు ఆధారంగా ఆ ప్రాంతానికి రైల్వే పోలీసులు చేరుకుంటారు. మీరు పోగొట్టుకున్న వస్తువు గురించి వెతుకుతారు. అప్పటికే ఎవరైనా కాజేయకుంటే మీ వస్తువు పడినచోటే ఉంటుంది కాబట్టి రైల్వే పోలీసులు వెతికి పట్టుకుని స్టేషన్ కు తీసుకెళతారు. వస్తువు దొరికితే మీకు సమాచారం అందిస్తారు. సదరు స్టేషన్ కు వెళ్లి ఫార్మాలిటీ పూర్తి చేసి, మీ వస్తువును మీరు తీసుకెళ్లవచ్చు.

అలారం చైన్ లాగొచ్చా?
విలువైన వస్తువు ఏదైనా రైలులో నుంచి పడిపోతే అలారం చైన్ లాగొచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే, అత్యవసర పరిస్థితుల్లో అంటే.. మీతో ప్రయాణిస్తున్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులు రైలు ఎక్కలేక పోయిన సదర్భాలలో, రైలులో అగ్నిప్రమాదం కానీ దోపిడీ కానీ మరేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో మాత్రమే చైన్ లాగొచ్చు. ఇతరత్రా కారణాలతో చైన్ లాగడం నేరం. దానికి జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News