Andhra Pradesh: తమ్ముడి అక్రమ సంబంధమే అన్న ప్రాణం తీసింది! చంద్రగిరిలో కలకలం సృష్టిస్తున్న నాగరాజు హత్య
- మాట్లాడాలని పిలిచి కారుకు నిప్పంటించిన వైనం
- మంటల్లో నాగరాజు సజీవదహనం
- మరిది అక్రమ సంబంధమే కారణం: నాగరాజు భార్య
ఓ వివాహితతో తమ్ముడికి ఉన్న అక్రమ సంబంధం అన్న ప్రాణాలమీదికి తెచ్చింది. వివాహిత బంధువులు ఆగ్రహంతో కారుకు నిప్పంటించడంతో ఆ అన్న మంటల్లో సజీవంగా దహనమయ్యాడు. రాత్రిపూట మాట్లాడాలని పిలిచి ఇంత దారుణానికి తెగబడ్డారని, నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య కన్నీటిపర్యంతమయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగిన హత్యలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు గురైన నాగరాజు భార్య సులోచన వెల్లడించిన వివరాల ప్రకారం..
నాగరాజు తమ్ముడు పురుషోత్తం బ్రాహ్మణపల్లిలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళ బంధువులు పురుషోత్తంను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో తమ్ముడిని కాపాడుకోవడం కోసం నాగరాజు జాగ్రత్తలు తీసుకున్నాడు. పురుషోత్తంను బెంగళూరుకు పంపించేశాడు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గోపీ అనే వ్యక్తి నుంచి నాగరాజుకు ఫోన్ వచ్చింది. ఇకపై గొడవలు జరగకుండా కాంప్రమైజ్ చేసుకుందాం రమ్మంటూ పిలిచారు.
గొడవకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చనే ఉద్దేశంతో మాట్లాడేందుకు నాగరాజు వెళ్లాడు. కాసేపటికి సుమారు 9:20 గంటల ప్రాంతంలో నాగరాజు ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఆ తర్వాత కారు తగలబడిపోతోందనే సమాచారంతో పోలీసులు బ్రాహ్మణపల్లికి చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా కారు నాగరాజుకు చెందినదిగా గుర్తించారు. కారుతో పాటు నాగరాజు కూడా మంటల్లో కాలిపోయాడని నిర్ధారించారు. కాగా, మరిది అక్రమ సంబంధమే తన భర్త హత్యకు కారణమని, ఈ వ్యవహారంలో తన భర్త నాగరాజుకు ఎలాంటి సంబంధంలేదని సులోచన ఆవేదన వ్యక్తం చేసింది. నాగరాజును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
నాగరాజు భార్య సులోచన, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్రాహ్మణపల్లికి చెందిన రూపంజయ, సర్పంచ్ చాణక్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రూపంజయను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ ఓబులేశు తెలిపారు.