balagam: ఇది నా సినిమానా?.. ‘బలగం’కు వస్తున్న స్పందనపై ప్రియదర్శి!

villagers get emotional watching balagam movie priyadarshi responds
  • ఊర్లలో ప్రత్యేకంగా బలగం సినిమా ప్రదర్శన
  • క్లైమాక్స్ చూసి భావోద్వేగానికి గురవుతున్న జనం
  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
బలగం.. నెల కిందటి వరకు ఎవరికీ తెలియని సినిమా ఇది. జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ తెలిసిన వేణు తీసిన చిత్రం. పెద్ద హీరో లేడు.. ఫైట్లు లేవు.. గ్రాఫిక్స్ లేవు.. వందల కోట్ల బడ్జెట్ అంతకన్నా కాదు!!

బంధువుల మధ్య అనుబంధాన్ని.. పల్లెను.. మట్టి మనుషులను చూపించాడు వేణు. ఎప్పుడు మొదలుపెట్టాడో.. ఎప్పుడు పూర్తి చేశాడో.. ఎవ్వరికీ అంచనాలు లేవు. సైలెంట్ గా థియేటర్లలోకి వదిలాడు.. అంతే.. సంచలనం సృష్టించింది. సృష్టిస్తూనే ఉంది.

ఇటు కామెడీ.. అటు ఎమోషన్ ను బ్యాలెన్స్ చేస్తూ వేణు తీసిన సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది. పాటతో క్లైమాక్స్ ను పూర్తి చేయడం.. ఆ పాటతోనే టైటిల్ కు జస్టిఫికేషన్ ఇవ్వడం అద్భుతం. ఆ ఒక్క పాట ప్రతి మనసునూ కదిలిస్తోంది. ప్రతి కంటినీ తడిపేస్తోంది. 

థియేటర్లలో ఇంకా ఆడుతున్న ఈ సినిమా.. అటు ఓటీటీలోనూ సందడి చేస్తోంది. అంతేకాదు.. పలు గ్రామాల్లో బలగం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. సినిమాను చూస్తూ ఎంతో మంది భావోద్వేగానికి లోనవుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘‘జనాల్లోకి బాహుబలి కన్నా ఎక్కువ చొచ్చుకుపోయింది బలగం. ఇప్పట్లో ఆగేలా లేదు’’ అంటూ నాని రెడ్డి అనే వ్యక్తి ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ‘బలగం’ హీరో ప్రియదర్శి.. ‘ఇది నా సినిమా నా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ వేణు కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘‘నా బలగం ప్రేక్షకులని ఇలా కదిలిస్తోందని వీడియోస్ నాకు పంపిస్తుంటే అదృష్టంగా భావిస్తున్నా. ఇలా చూసి ‘మళ్లీ థియేటర్స్ కి ఫ్యామిలీతో వెళ్లి చూస్తున్నాం’ అని పిక్స్ పంపుతున్నారు. ఆనందభాష్పలతో మీ వేణు’’ అని ట్వీట్ చేశారు.
balagam
villagers get emotional
Venu Yeldandi
Priyadarshi

More Telugu News