SRH: సొంతగడ్డపై ఘోరంగా ఓడిపోయిన సన్ రైజర్స్
- రాజస్థాన్ రాయల్స్ చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమి
- 204 పరుగుల లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 131 రన్స్ చేసిన సన్ రైజర్స్
- చహల్ కు 4 వికెట్లు
- ఫర్వాలేదనిపించిన సమద్, మయాంక్
- చివర్లో ధాటిగా ఆడిన ఉమ్రాన్ మాలిక్
భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 16వ సీజన్ ను దారుణ ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ తో ఇవాళ జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 72 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపై ఈ పరాభవం ఎదురైంది.
టాస్ గెలిచారన్న మాటే గానీ... సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ లో ఏదీ కలిసిరాలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే ఆ నిర్ణయం బెడిసికొట్టింది. రాజస్థాన్ బ్యాటర్లు ఉతికారేశారు. ఇక, 204 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బలే! 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అది కూడా అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ జోడీ ఆఖరి ఓవర్లో 23 పరుగులు బాదడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్ డౌన్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అయ్యారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 27 పరుగులు చేయగా, ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ 13 పరుగులు చేసి నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8) విఫలం కాగా... అదిల్ రషీద్ 18 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ కాస్త పోరాటం కనబర్చి 32 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో ఉమ్రాన్ మాలిక్ (19 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఉమ్రాన్ మాలిక్ 8 బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 2 సిక్సులు కొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 4 వికెట్లు తీయడం విశేషం. ట్రెంట్ బౌల్ట్ 2, జాసన్ హోల్డర్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.
రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబయి ఇండియన్స్