CPI Narayana: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ స్పందన
- ఏపీ, ఒడిశా సరిహద్దులో కొటియా గ్రామాలు
- నిన్న పర్యటించిన ధర్మేంద్ర ప్రధాన్
- ఏపీ అధికారులను చూసి గో బ్యాక్ ఆంధ్రా అంటూ ఆగ్రహం
- కేంద్రమంత్రిది బాధ్యతా రాహిత్యం అన్న సీపీఐ నారాయణ
- బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో పర్యటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్కడి ఏపీ అధికారులను గో బ్యాక్ ఆంధ్రా అనడం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కొటియా గ్రామాల్లోని ఆంధ్ర అధికారులను గో బ్యాక్ ఆంధ్రా అనడం కేంద్రమంత్రికి తగదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ధర్మేంద్ర ప్రధాన్ అటువంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని విమర్శించారు.
బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించే ఇలాంటి నేతలతో కేంద్రానికి నష్టం జరుగుతుందని, మోదీ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ను క్యాబినెట్ నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.
నిన్న ధరేంద్ర ప్రధాన్ కొటియా గ్రామాల్లో పర్యటించగా, సీఐ రోహిణి పతి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారు. అయితే, కేంద్రమంత్రి భిన్నంగా స్పందించారు. ఏపీ అధికారులకు ఇక్కడేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ చెప్పేది కూడా వినిపించుకోకుండా నో ఆంధ్రా, ఓన్లీ ఒడిశా అంటూ వ్యాఖ్యానించారు.