Maharashtra: రైతులకు మంజూరైన బావుల పనులకు లంచం డిమాండ్.. అధికారి కార్యాలయం ముందు రూ. 2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఘటన
- గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరు
- ఒక్కో బావికి రూ.48 వేలు చొప్పున లంచం ఇస్తేనే పనులు జరుగుతాయన్న బీడీవో
- వీడియో వైరల్ కావడంతో బీడీవోను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
రైతులకు మంజూరైన బోరు బావు పనులను ప్రారంభించేందుకు లంచం అడిగిన అధికారి కార్యాలయం బయట రూ. 2 లక్షలను వెదజల్లారో సర్పంచ్. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగిందీ ఘటన. కరెన్సీ నోట్లను సర్పంచ్ వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి రూ. 4 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.
రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా ప్రారంభించాలని బ్లాక్ డెవలప్మెంట్ అధికారి (బీడీవో) జ్యోతి కవడదేవిని గ్రామ సర్పంచ్ మంగేష్ సాబ్లే (24) కోరారు. అయితే, పనులు ప్రారంభించాలంటే ఒక్కో బావికి రూ. 48 వేలు సమర్పించుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. రైతులు పేదలని, లంచం ఇచ్చుకోలేరని ఆయన ప్రాధేయపడినా ఆమె వినిపించుకోలేదు. డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయని తేల్చి చెప్పారు.
దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న సర్పంచ్ మంగేష్ రూ. 100, రూ. 500 నోట్లతో రూ. 2 లక్షలను దండగుచ్చి మెడలో వేసుకుని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అందరూ చూస్తుండగానే తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ దండలోంచి నోట్లు ఒక్కొక్కటిగా తీస్తూ వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి విపరీతంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన మంత్రి గిరీష్ మహాజన్ బీడీవో జ్యోతి కవడదేవిని సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు. తాను వెదజల్లిన డబ్బును పేదల నుంచి సేకరించానని, ఆ మొత్తాన్ని కూడా బీడీవో నుంచి వసూలు చేసి ఇప్పించాలని సర్పంచ్ కోరారు.