Walking: కనీసం వారంలో రెండు రోజులు నడిచినా ఆరోగ్య ప్రయోజనాలు..!
- గుండె జబ్బుల మరణాలు 15 శాతం తక్కువ
- వారంలో ఎక్కువ రోజులు చేస్తే మరిన్ని ప్రయోజనాలు
- స్థూలకాయం, స్ట్రోక్, కేన్సర్, మధుమేహం రిస్క్ తగ్గించుకోవచ్చు
భౌతికంగా శ్రమించాల్సిన అవసరం తగ్గిపోతున్న నేటి కాలంలో నడవడం ఒక్కటే మన ఆరోగ్యానికి రక్షణనిచ్చే వ్యాపకంగా చూడాలన్నది నిపుణుల సూచన. నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది చాలా కాలంగా తెలిసిన విషయమే. నడవడం వల్ల వచ్చే ప్రయోజనాలపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి.
రోజూ 8,000 అడుగులు తక్కువ కాకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని లోగడ పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగా వచ్చే మరణ ముప్పు గణనీయంగా తగ్గిపోతుంది. తాజాగా ఓ అధ్యయనం అయితే వారంలో ఒకటి రెండు రోజుల పాటు 8,000 అడుగులు నడిచినా కానీ, ప్రయోజనాలు ఉంటాయని చెబుతోంది. మరణ ముప్పు తగ్గుతుందని తెలిపింది. ఈ అధ్యయన ఫలితాలు జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమయ్యాయి.
రోజువారీ భౌతిక శ్రమ లేకుండా జీవించే వారితో పోలిస్తే.. వారంలో ఒకటి రెండు రోజుల పాటు 8,000 అడుగులు నడిచే వారు 14.9 శాతం తక్కువ మరణ ముప్పును ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఇలా రోజువారీ 8,000 అడుగులు నడవడం అన్నది వారంలో ఎక్కువ రోజులు చేయడం వల్ల మరింత మరణ ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు తెలుసుకున్నారు.
వారంలో మూడు రోజులు నడిచే వారికి 16.5 శాతం గుండె జబ్బుల మరణ ముప్పు తగ్గుతుందని వెల్లడైంది. 60 ఏళ్ల లోపు వారు రోజువారీ 10,000 అడుగులు, 60 ఏళ్లు దాటిన వారు రోజువారీ 8,000 అడుగులతో మరణ ముప్పు తగ్గించుకోవచ్చని గత అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ముఖ్యంగా వేగవంతమైన నడకతో ప్రయోజనాలు ఎక్కువ.
నిత్యం 8,000 అడుగులు అంటే అది సుమారు నాలుగు మైళ్లు. 6.4 కిలోమీటర్ల దూరం. ఇందుకు కనీసం 1.30 గంటల వరకు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. గట్టి పట్టుదల, ఇష్టం ఉంటే దీన్ని ఆచరించడం పెద్ద కష్టమేమీ కాబోదు. ఇలా వారంలో ఐదు రోజులు చేసినా చాలు. గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం, స్ట్రోక్, కొన్ని రకాల ఇన్ ఫ్లమ్మేటరీ సమస్యలు, కేన్సర్ల రిస్క్ తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.