Madhya Pradesh: బాలేశ్వర్ టెంపుల్ లో బుల్డోజర్లు..అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు
- అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న అధికారులు
- ఇటీవల మెట్లబావి పైకప్పు కూలి 36 మంది దుర్మరణం
- ప్రమాదం నేపథ్యంలో స్పందించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని బాలేశ్వర్ ఆలయంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 36 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఆలయంలోని మెట్లబావిపై నిర్మించిన స్లాబ్ కూలి భక్తులు బావిలోపల పడిపోయారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. పార్క్ స్థలాన్ని కబ్జా చేసి ఆలయం కట్టారని, తాము ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఆలయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వ ఆదేశాలతో సోమవారం ఉదయమే అధికారులు బుల్డోజర్లతో సహా బాలేశ్వర్ టెంపుల్ చేరుకున్నారు. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి మరీ అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టారు. పనులను పర్యవేక్షించేందుకు ఇండోర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు బాలేశ్వర్ టెంపుల్ కు చేరుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
బాలేశ్వర్ టెంపుల్ అక్రమ నిర్మాణాలపై కిందటేడాది మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెప్పారు. అయితే, ఆలయంలో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే భక్తులు సెంటిమెంట్ ను దెబ్బతీసినట్లవుతుందని ఆలయ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గారు. ఇటీవల శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మెట్లబావి పై కప్పు కూలిపోవడంతో 36 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. స్వయంగా ఆలయానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆలయంలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై తాజాగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.