IAS pet dog: ఐఏఎస్ అధికారి శునకం కోసం గ్వాలియర్ పోలీసుల గాలింపు
- మూడు రోజులుగా వెతుకుతున్న పోలీసులు
- పోస్టర్లు వేసి, పట్టిచ్చిన వారికి బహుమానం ఇస్తామని ప్రకటన
- ఢిల్లీ నుంచి భోపాల్ తీసుకెళుతుండగా తప్పిపోయిన శునకం
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు మూడు రోజులుగా ఓ కుక్క ఆచూకీ కోసం చెమటలు కక్కుతూ వెతుకుతున్నారు. మిగతా పనులు పక్కనపెట్టి మరీ ఆ కుక్క కోసం గాలిస్తున్నారు. వీధుల్లో పోస్టర్లు వేసి, కుక్క ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇంతకీ ఆ కుక్క ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా.. ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు జంతువు కావడమే దానికున్న ప్రత్యేకత!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు తప్పిపోయిన తన పెంపుడు శునకాన్ని ఎలాగైనా వెతికి పట్టుకురమ్మంటూ పోలీసులకు హుకూం జారీ చేశాడా అధికారి. సాక్షాత్తూ ఐఏఎస్ అధికారి ఆదేశించడంతో పోలీసులు సదరు శునకం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఢిల్లీలో నివసించే ఐఏఎస్ అధికారి రాహుల్ ద్వివేదికి చెందిన పెంపుడు శునకం గ్వాలియర్ లో దగ్గర్లోని బిలువా ప్రాంతంలో తప్పిపోయింది.
ఢిల్లీ నుంచి కారులో రెండు శునకాలను తీసుకెళుతుండగా అందులో ఒక కుక్క తప్పిపోయింది. బిలువా ప్రాంతంలో భోజనం కోసం కారు ఆపడంతో శునకాలు రెండూ సిబ్బంది చేతుల్లోంచి విడిపించుకుని పరిగెత్తాయి. సిబ్బంది వెంటపడి ఒక శునకాన్ని పట్టుకున్నారు. మరొకటి మాత్రం దొరకలేదు. దీంతో రాహుల్ ద్వివేది పోలీసులకు సమాచారం అందించారు. తప్పిపోయిన తన శునకాన్ని వెతికిపట్టుకొమ్మని ఆదేశించారు. దీంతో గ్వాలియర్ పోలీసులు ప్రస్తుతం ఆ కుక్క కోసం గాలిస్తున్నారు.