Italy: ఇంగ్లిష్ ను నిషేధించేందుకు ఇటలీ యోచన
- అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో ఇంగ్లిష్‌ను నిషేధిస్తూ బిల్లు రూపకల్పన
- నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.82 లక్షల జరిమానా
- ప్రభుత్వోద్యోగంలో చేరే వారికి ఇటలీ భాషపై పట్టు తప్పనిసరి చేస్తూ నిబంధన
- త్వరలో ఈ బిల్లుపై చర్చించనున్న పార్లమెంట్
ఇందుగలడు అందులేడు..అని భగవంతుడి గురించి మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇంగ్లిష్ భాష వినిపించని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. మాతృభాషపై పట్టు ఉన్నా లేకపోయినా ఎలాగోలా నెట్టుకురావచ్చు కానీ ఇంగ్లిష్ రాకపోతే పూటగడవని పరిస్థితి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఉన్న పరిస్థితి ఇది. అయితే.. పాశ్చాత్య దేశమైన ఇటలీ తాజాగా సంచలనం నిర్ణయం తీసుకుంది. అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో అంగ్లభాషా వినియోగంపై నిషేధం విధించేందుకు యోచిస్తోంది.
అంతేకాదు.. ఈ ఆదేశాలను ఉల్లంఘించేవారిపై ఏకంగా రూ.82 లక్షల(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సారథ్యంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఓ ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. ఇంగ్లిష్‌తో పాటూ అన్ని విదేశీ భాషలపై ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును సిద్ధం చేసింది.
అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో ఆంగ్ల పదాల వినియోగం మితిమీరడంపై ప్రభుత్వం తన బిల్లులో ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల మాతృభాష స్థాయి దిగజారుతోందని, మరణ సదృశంగా మారుతోందని వ్యాఖ్యానించింది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగాక కూడా ఆంగ్ల భాష కొనసాగడంలో హేతుబద్ధత లేదన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. ఇక ప్రభుత్వోద్యోగాలు చేసేవారికి ఇటలీ భాషపై తప్పనిసరిగా పట్టు ఉండాలని కూడా ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. ఈ బిల్లుపై ఆ దేశ పార్లమెంటులో చర్చలు జరగాల్సి ఉంది.