coolroof: కూల్ రూఫ్ తో కరెంటు ఆదా చేయొచ్చు: మంత్రి కేటీఆర్
- మీటర్ కు రూ.300 మాత్రమే ఖర్చవుతుందన్న మంత్రి
- కరెంటు వాడకం తగ్గి మీ పెట్టుబడి తిరిగొస్తుందని వివరణ
- ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వం తరఫున శిక్షణ అందిస్తామని వెల్లడి
వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూల్ రూప్ ఉపయోగపడుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇళ్లు, ఆఫీసులు, వాణిజ్య భవనాలలో కరెంట్ వాడకం పెరిగిపోతుందని చెప్పారు. దీంతో కరెంట్ బిల్లు భారీగా వస్తుందని వివరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించడంకోసం కూల్ రూప్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ విధానం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.
కూల్ రూఫ్ వల్ల మీటర్ కు కేవలం రూ.300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గి ఆ మేరకు బిల్లు కూడా తక్కువ వస్తుందని, కూల్ రూఫ్ కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున శిక్షణ అందిస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 'మన నగరం' కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి కూల్ రూఫ్ కు ఉపయోగిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.