french minister: ‘ప్లేబాయ్’ కవర్ పేజీపై మహిళా మంత్రి ఫొటో.. ఫ్రాన్స్ లో దుమారం!
- ఇటీవల ప్లేబాయ్ పత్రికకు మార్లీనె షియప్పా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ
- ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరించిన మంత్రి
- ఫొటో బోల్డ్ గా ఉండటంతో విమర్శలు
- మార్లీనెను పిలిపించి మాట్లాడిన ప్రధాని ఎలిజబెత్ బోర్న్
అమెరికాకు చెందిన ‘ప్లేబాయ్’ మ్యాగ్జిన్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మహిళా మంత్రి మార్లీనె షియప్పా ఫొటో ప్రచురించడం దుమారం రేపుతోంది. ఆమె వస్త్రధారణ తప్పుడు సంకేతాలను ఇస్తుందంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. మార్లీనెతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ మాట్లాడారు. ‘మీ ప్రవర్తన సరైన రీతిలో లేదు’ అని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
40 ఏళ్ల మార్లీనె షియప్పా.. ఫ్రాన్స్ ప్రభుత్వంలో సోషల్ ఎకానమీ, అసోసియేషన్స్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇమ్మాన్యువల్ మాక్రన్ ప్రభుత్వంలో 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్లేబాయ్ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫొటో షూట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. ఫొటో మరీ బోల్డ్ గా ఉండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ప్లేబాయ్ పత్రిక కవర్‌పేజీపై ఫోటోనే కాదు.. ఆమె 12 పేజీల ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మహిళలు, గే, అబార్షన్ హక్కుల గురించి ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. దీనిపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. మార్లీనె మాత్రం తాను చేసింది సరైనదేనని చెబుతున్నారు. ‘‘తమ శరీరాలపై ఉన్న హక్కులను మహిళలు కాపాడుకోవాలి. వారు ఏం కావాలంటే అది, ఎక్కడైనా చేసేలా ఉండాలి. తిరోగమనవాదులు ఎంత విసిగించినా.. ఫ్రాన్స్ లో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారు’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.