Diabetes: మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే సమస్యలు ఇవీ..

Diabetes can lead to these health issues

  • సమస్య ఉన్నా తెలుసుకోని వారు ఎక్కువే
  • నియంత్రణలో పెట్టుకోకపోతే పలు అనారోగ్య సమస్యలు
  • గుండె, కిడ్నీ సమస్యలు ఎక్కువే
  • లైంగిక సామర్థ్యంలోనూ క్షీణత

భారత్ మధుమేహానికి ప్రపంచ రాజధానిగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన దేశంలో మధుమేహం బాధితుల సంఖ్య 8 కోట్లకు చేరుకుంటోంది. జీవక్రియల్లో మార్పుల వల్ల వచ్చే సమస్యే మధుమేహం. మన దేశంలో 2045 నాటికి చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య 13.5 కోట్లకు చేరుకోవచ్చన్నది ఒక అంచనా. 

భారత్ లో 4 కోట్ల మందిలో ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టోలరెన్స్ ఉన్నట్టు అంతర్జాతీయ డయాబెటిస్ ఫౌండేషన్ (ఐడీఎఫ్) తన తాజా నివేదికలో ప్రస్తావించింది. అంటే వీరికి మధుమేహం ముప్పు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. మన దేశంలోని మధుమేహం బాధితుల్లో సగం మందికి తమకు సమస్య ఉన్నట్టు తెలియదు. మధుమేహం బారిన పడినా.. జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకుని, చురుకైన జీవనం గడిపే వారికి దాదాపు ఎలాంటి వ్యాధుల రిస్క్ ఉండదు. అలా కాకుండా, మధుమేహం సమస్యను గుర్తించకుండా, చికిత్స తీసుకోకుండా వదిలిస్తే ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.

గుండె జబ్బులు
మధుమేహంతో గుండెకు రిస్క్ ఎక్కువ. రక్త నాళాల సామర్థ్యం తగ్గుతుంది. గుండెకు సంబంధించి రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కిడ్నీ సమస్యలు
మధుమేహం బారిన పడిన వారు కిడ్నీల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చాలా మంది కిడ్నీలకు సంబంధించి ప్రాథమిక సంకేతాలను పట్టించుకోరు. దీంతో వారిలో సమస్య మరింత పెరిగిపోతుంది. మధుమేహ బాధితుల్లో దీర్ఘకాలంలో కనిపించే ఇతర సమస్యల్లో కిడ్నీ జబ్బులు కూడా ముఖ్యమైనవి. కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది.

నరాలు దెబ్బతినడం
మధుమేహం నియంత్రణలో పెట్టుకోకపోతే అది డయాబెటిక్ న్యూరోపతికి దారితీస్తుంది. రక్తంలో షుగర్ అధికంగా ఉండడం వల్ల సూక్ష్మ నరాలు దెబ్బతింటాయి. దీంతో శరీరంలోని వివిధ ప్రాంతాలకు నాడీ సంకేతాలు చేరవు. శరీరంలోని అవయవాల పనితీరు బలహీనపడుతుంది. డయాబెటిక్ రెటీనోపతీ సమస్య కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిరాశ, నిస్పృహ
నిరాశ,నిస్పృహకు, మధుమేహానికి దగ్గరి సంబంధం ఉందని వైద్యులు చెబుతుంటారు. మధుమేహంతో శారీరక ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. చివరికి ఇది మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది.

నోటి ఆరోగ్యం
మధుమేహం ఉన్న వారిలో నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. నోరు ఎండిపోవడం వల్ల బ్యాక్టీరియాకి కేంద్రంగా మారుతుంది. దీంతో చిగుళ్లు వాచి, రక్తస్రావం కావచ్చు. నోటిలో పొక్కులు మానేందుకు చాలా రోజుల సమయం పడుతుంది.

లైంగిక కోర్కెలు
మధుమేహం వల్ల లైంగిక కోర్కెలు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే లైంగిక చర్యలకు సంబంధించిన కీలకమైన అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో కోర్కెలు తగ్గిపోతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఏర్పడుతుంది.

  • Loading...

More Telugu News