Arvind Kejriwal: వృద్ధులకు రాయితీలు నిలిపివేయవద్దని కోరుతూ ప్రధానికి సీఎం కేజ్రీవాల్ లేఖ

Dont stop concession given to elderly in railways Arvind Kejriwal writes to PM Modi

  • పెద్దల దీవెనలే మనల్ని ముందుకు నడిపిస్తాయన్న ఢిల్లీ సీఎం
  • రాయితీలకు అయ్యే ఖర్చు రూ.1,600 కోట్లు కేంద్ర బడ్జెట్లో ఏ మూలకని ప్రశ్న
  • నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని సూచన

రైళ్లలో వృద్ధులకు రాయితీలు కల్పించాలని, వాటిని నిలిపివేయడం సరికాదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖను కేజ్రీవాల్ తన ట్విట్టర్ పేజీలోనూ పోస్ట్ చేశారు. కోట్లాది మంది వృద్ధులు టికెట్ చార్జీల్లో రాయితీల వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలియజేస్తూ.. దయచేసి వీటిని నిలిపివేయవద్దని కోరారు. కరోనా వచ్చిన తర్వాత రైళ్ల సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడం తెలిసిందే. కొన్ని నెలల తర్వాతే రైలు సర్వీసులు తిరిగి తెరుచుకున్నాయి. 

ఆ సమయంలో రైలు టికెట్ చార్జీల్లో వృద్ధులు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను రైల్వే శాఖ నిలిపివేసింది. ఆ తర్వాత పునరుద్ధరించలేదు. ఇప్పటికీ ప్రయాణికుల టికెట్ చార్జీల రూపంలో సగం మేర నష్టాలను రైల్వే ఎదుర్కొంటోందని ఆ శాఖ చెబుతూ వస్తోంది. దీంతో రాయితీలు కొనసాగించాలంటూ కేజ్రీవాల్ కోరడం గమనార్హం. రాయితీలను ఎత్తివేయడం దురదృష్టకరమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పెద్దల దీవెనలే మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తున్నాయనే విషయాన్ని మరిచిపోకూడదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 

పెద్దల ఆశీర్వాదం వల్లే ఢిల్లీ పురోగతి సాధిస్తోందంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాము పెద్దలను తీర్థయాత్రలకు ఉచితంగా తీసుకెళుతున్నట్టు చెప్పారు. ఇక్కడ డబ్బు కాదని, దీని వెనుక ఉద్దేశ్యాన్ని చూడాలని కోరారు. రైలు టికెట్ చార్జీల రాయితీల కోసం ఇచ్చే రూ.1,600 కోట్లు సముద్రం మాదిరి కేంద్ర బడ్జెట్ లో నీటి బిందువంతగా పోల్చారు. రాయితీల నిలిపివేత నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని ప్రధానిని కేజ్రీవాల్ తన లేఖ ద్వారా కోరారు.

  • Loading...

More Telugu News