Jagan: ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన సీఎం జగన్

CM Jagan clarifies on early elections

  • వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో సమీక్ష
  • సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయన్న సీఎం జగన్
  • ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడి
  • రూమర్లను తిప్పికొట్టాలని పిలుపు
  • గడప గడపకు కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం

ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. సంవత్సరంలో ఎన్నికలకు వెళుతున్నామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. తద్వారా, ముందుగానే అసెంబ్లీని రద్దు చేయనున్నారని జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేశారు. 

మున్ముందు ఇంతకంటే తీవ్రంగా పుకార్లు వ్యాపింపజేస్తారని, టికెట్లు దక్కనివారి జాబితా ఇదేనంటూ 60 మంది పేర్లతో ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు. 

"మనం యుద్ధం చేస్తోంది మారీచుల వంటి రాక్షసులతో. దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతాన్ని పాటించే గజదొంగల ముఠా అది. మనం వచ్చాక వారి కార్యక్రమానికి విఘాతం కలగడంతో ఈ విధంగా పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గుడు మరొకరు లేరు అన్నట్టుగా ఆయా ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలి. 

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాదు. అందరూ ఏకం కావడం వల్ల వారికి రెండో ప్రాధాన్యత ఓటు లభించింది. అయినా కూడా అది వాపే కానీ బలుపు కాదు. అదే బలం అన్నట్టుగా కొన్ని మీడియా చానళ్లలో చూపిస్తున్నారు. 21 స్థానాలకు ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో గెలిచింది మనమే. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంపై పార్టీ నేతలు శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి" అని దిశానిర్దేశం చేశారు.

  • Loading...

More Telugu News