Sabitha Indra Reddy: పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు: సబితా ఇంద్రారెడ్డి
- వాట్సాప్ లో తెలుగు, హిందీ క్వశ్చన్ పేపర్లు
- విద్యార్థుల్లో ఆందోళన
- అధికారులతో సబితా టెలీ కాన్ఫరెన్స్
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా, వాట్సాప్ లో తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని వెల్లడించారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.
స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడొద్దని సబిత హితవు పలికారు. ఇప్పటికి రెండు పరీక్షలు పూర్తవగా, మరో నాలుగు పరీక్షలు మిగిలున్నాయని, ఈ పరీక్షల నిర్వహణలో కఠిన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు.
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించాలని ఆదేశించారు. పరీక్ష విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది కూడా పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు.