Cholesterol: కొలెస్ట్రాల్ కు చెక్ పెడితే.. చాలా సమస్యలు దూరం
- ఇందుకోసం తీసుకునే ఆహారంలో మార్పులు
- ఓట్ మీల్, నట్స్ తో మంచి ఫలితాలు
- సిట్రస్ ఫండ్లు, ఫ్యాటీ ఫిష్ తీసుకోవచ్చు
- వంట నూనెలు అన్నీ కాకుండా కొన్నే మంచివి
కొలెస్ట్రాల్ పైకి కనిపించని మహమ్మారి. మన రక్తనాళాల గోడల్లో పేరుకుపోయి ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. అందుకని కొలెస్ట్రాల్ ను పరిమితుల్లో ఉంచుకోవడం ద్వారా గుండె జబ్బులు, రక్తపోటు రిస్క్ ను దూరం పెట్టుకోవచ్చు. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాన్ని తీసుకోవాలి.
ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతే రక్త ప్రవాహ మార్గం కుచించుకుపోతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. గుండె పంపింగ్ కు సరిపడా రక్తం అందదు. అది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. అందుకని సహజసిద్ధంగా కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించడం అవసరం.
ఓట్ మీల్
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని విస్కోస్ సొల్యూబుల్ ఫైబర్ (బీటా గ్లూకాన్) చెడు కొలెస్ట్రాల్ ను (ఎల్డీఎల్) తగ్గించేస్తుంది. ఒక కప్పు ఓట్స్ లో 1-2 గ్రాముల సొల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఓట్స్ లో చాలా రకాలు ఉన్నాయి. తినడానికి ఏది సౌకర్యం అనిపించినా, దాన్ని తీసుకోవచ్చు.
నట్స్
బాదం గింజలను రోజువారీ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. వాల్ నట్స్, బాదం తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతున్నట్టు ఓ అధ్యయనం గుర్తించింది. ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పిస్తా పప్పుల్లో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
సిట్రస్ పండ్లు
సిట్రస్ జాతి పండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటును బ్యాలన్స్ చేస్తుంది. కమలా, నారింజ, ద్రాక్ష, నిమ్మ, పైనాపిల్ ను తీసుకోవచ్చు. వీటిల్లోని కాంపౌండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిల్లోని ఫ్లావనాయిడ్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
ఫ్యాటీ ఫిష్
ఫ్యాటీ ఫిష్ అయిన సాల్మన్, మాక్రెల్ ను తీసుకోవడం మంచిది. రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. ఈ చేపల్లో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను శుద్ధి చేస్తాయి. ట్రైగ్లిజరాయిడ్స్ ను తగ్గిస్తాయి.
వంట నూనెలు
కనోలా, సన్ ఫ్లవర్, శాఫ్లవర్ అన్నవి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు సాయపడే నూనెలు. ఇవి కాకుండా నువ్వుల నూనె, పల్లీ నూనె కూడా వాడుకోవచ్చు. వీటిల్లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అను శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. హానికారక శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ. ఇవి కాకుండా రోజువారీ నడకతోనూ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.